Mumbai Indians: WPLలో ముంబై హవా! ఛాంపియన్స్ కిరీటం మళ్ళీ వారిదే! 11 month ago

featured-image

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2025 సీజన్ ముంబై ఇండియన్స్ ఘన విజయంతో ముగిసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శనతో విజయం సాధించి..రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ WPL చరిత్రలో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుని.. తమ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటింది. 


టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ మొదట్లోనే వికెట్లు తీసి ముంబై జట్టును కష్టాల్లోకి నెట్టింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (44 బంతుల్లో 66 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకుంది. జట్టు 14/2తో కష్టాల్లో ఉన్న సమయంలో.. హర్మన్‌ప్రీత్ తన అనుభవంతో క్యాప్టెన్ నాక్ ప్రదర్శనతో జట్టును 149 పరుగుల లక్ష్యానికి చేర్చింది. నాట్ స్కైవర్-బ్రంట్ (30 పరుగులు) కూడా కీలక సమయంలో రాణించి.. జట్టు స్కోరును పెంచడంలో సహాయపడింది. ఢిల్లీ బౌలర్ మారిజాన్ కాప్ 4 ఓవర్లలో కేవలం 11 రన్స్ మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసి ముంబై జట్టును కట్టడి చేసింది. 

150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభం నుంచే తడబడింది. కెప్టెన్ మెగ్ లానింగ్.. షఫాలీ వర్మ తక్కువ స్కోర్లకే అవుట్ కావడంతో జట్టు ఒత్తిడిలోకి వెళ్లింది. జెమిమా రోడ్రిగ్స్ (30) నిలబడిన.. మరో ఎండ్ నుండి తనకి సహాయం దొరకలేదు. చివరిలో మారిజాన్ కాప్ (26 బంతుల్లో 40 పరుగులు) ఒంటరి పోరాటం చేసినా.. జట్టును గెలిపించలేకపోయింది. ముంబై బౌలర్లలో నాట్ స్కైవర్-బ్రంట్ (3 వికెట్లు).. అమేలియా కెర్ (2 వికెట్లు) అద్భుత బౌలింగ్‌తో ఢిల్లీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 


ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఆటతీరు అద్భుతంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణించి ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో జట్టులోని ప్రతి క్రీడాకారిణి తమ అత్యుత్తమ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. WPL లో అత్యధిక పరుగులు చేసి నాట్ స్కైవర్-బ్రంట్ (523) ఆరంజ్ కాప్ ను.. అత్యధిక వికెట్లు తీసి అమేలియా కెర్ (18) పర్పుల్ కాప్ ను దక్కించుకున్నారు. ముంబై, రెండు WPL ట్రోఫీలను గెలుచుకుని.. మహిళా క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. IPLలో ఐదు టైటిళ్లతో ఇప్పటికే దూసుకుపోతున్న ముంబై, ఇప్పుడు WPLలోనూ అదే జోరును కొనసాగిస్తూ తన ఆధిపత్యాన్ని చాటింది. 


ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇది ఒక పీడకలలాగే మిగిలిపోయింది. సీజన్ మొత్తం బాగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ కు.. మళ్లీ నిరాసే మిగిలింది. వరుసగా మూడవసారి కూడా ఫైనల్‌లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. 5 ICC ట్రోఫీలను గెలుచుకున్న మెగ్ లానింగ్ కు .. WPL ట్రోఫీ మాత్రం అందని ద్రాక్ష పండులాగే ఉంది. అయితే హర్మన్‌ప్రీత్ కౌర్ మాత్రం తన అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలుపు దిశగా నడిపించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ మహిళా క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీగా నిలిచింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ జట్టు భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.


ఇది చదవండి: హైదరాబాదీ గ్రేటెస్ట్ ఆల్రౌండర్.. అబిద్ అలీకు శాశ్వత వీడ్కోలు..


Related News

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD